30, నవంబర్ 2012, శుక్రవారం


దారిపక్క, చెట్టుకింద, ఆరిన కుంపటి విధాన కూర్చున్నది ముసల్దొకతె
మూలుగుతూ, ముసురుతున్న ఈగలతో వేగలేక.

ముగ్గుబుట్టవంటి తలా, ముడుతలు తేరిన దేహం, కాంతిలేని గాజుకళ్లు,
తన కన్నా శవం నయం.

పడిపోయెను జబ్బుచేసి; అడుక్కునే శక్తిలేదు;రానున్నది చలికాలం;
దిక్కులేని దీనురాలు.

ఏళ్లు ముదిరి కీళ్లు కదిలి, బతుకంటే కోర్కె సడలె- పక్కనున్న బండరాతి
పగిదిగనే పడి ఉన్నది.

"ఆ అవ్వే మరణిస్తే ఆ పాపం ఎవ్వరి"దని వెర్రిగాలి ప్రశ్నిస్తూ వెళ్లిపోయింది!

ఎముక ముక్క కొరుక్కుంటు ఏమీ అనలేదు కుక్క.

ఒక ఈగను పడవేసుకు తొందరగా తొలగె తొండ క్రమ్మె చిమ్మచీకట్లూ,
దుమ్మురేగె నంతలోన.

"ఇది నా పాపం కా"దనె ఎగిరి వచ్చి ఎంగిలాకు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి